ap tet exam from

టెట్ పరీక్షకు సర్వం సిద్ధం: గంటా

49

ఈ నెల 10వ తేదీ నుంచి 19 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత (టెట్ ) పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. శనివారం ఆయన విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి ఈ నెల 19 వరకు టెట్‌పరీక్ష జరుగుతుందని, రోజూ రెండు సెషన్లలో టెట్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 3,97,957 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు వివరించారు. 14,891 మంది ఆప్షన్లు పెట్టుకోలేదన్నారు.

టెట్‌ నిర్వహణకు మొత్తం 113 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ పరీక్షకు హెల్ప్‌లైన్‌ నంబర్లు (9505619127, 9505780617, 9505853627) ఏర్పాటు చేసినట్టు వివరించారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 10 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. రెండోసారి డీఎస్సీ ద్వారా 10,351 పోస్టులను భర్తీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ పోస్టులకు జులై 6న ఏపీపీఎస్సీ నోటిఫీకేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జులై 7 నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరణ, ఆగస్టు 24, 25,26 తేదీల్లో రాత పరీక్ష, సెప్టెంబర్‌ 15న డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.