ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఇటీవల ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ బదిలీలకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న వైసీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో ఇటీవల వెంకటేశ్వరరావుతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను ఈసీ బదిలీ చేసింది.
అలాగే వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఎస్పీ రాహుల్ దేవ్ ను బదిలీ చేయడం సరికాదని వాదించింది. మరోవైపు ఈసీ న్యాయవాది స్పందిస్తూ.. ఈ బదిలీలు తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ఈ బదిలీలు ఎలాంటి శిక్ష కాదనీ, ఓసారి పోలింగ్ పూర్తయ్యాక వీరంతా తిరిగి తమ విధుల్లో చేరవచ్చని తేల్చిచెప్పారు. దీనితో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. నిన్న ఈ కేసుపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పు నేడు వెలువరించింది.