ap new dgp race

ఆంద్రప్రదేశ్ కొత్త డీజీపీ ఎవరో తెలుసా…?

20

జూన్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డీజీపీ మాల కొండయ్య, తరువాత డీజీపీ ఎవరన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. గత డిసెంబర్ లో రాజకీయ పరిణామాల మధ్య డీజీపీ గా ఎంపికైన మాల కొండయ్య కేవలం ఆరు నెలల సర్వీసు చేసి పదవి విరమణ చేయనున్నారు. అయితే మాలకొండయ్య తరువాత ఆంధ్రప్రదేశ్ డీజీపీ గా ఎవరు నియమితులవుతారన్న అంశం ఇప్పుడు పోలీస్ శాఖలో, ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీనియారిటీ పరంగా, సర్వీసు దృష్ట్యా ఆర్పి టాకూర్, గౌతం సవాంగ్, వినయ్ రంజన్ రే, కౌముది, రమణ మూర్తి, మరియు అనురాధ ముందంజలో ఉన్నారు.

పాత విధానం ప్రకారం అయితే మూడేళ్ల సర్వీస్ ఉన్న ఠాకూర్ కు ఎక్కువ అవకాశం లభించేది, కానీ కేంద్ర ప్రభుత్వంతో పోలీసు శాఖ తెగదెంపులు చేసుకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా డీజీపీని నియమించుకునే చట్టం అమలు చేయించుకుంది. దీంతో తనకు నచ్చిన వారికే పదవి కట్టబెట్టే సౌలభ్యం రాష్ట్ర ప్రబుత్వానికి దక్కింది. అయితే 1986 బ్యాచ్ కి చెందిన గౌతం సవాంగ్, ఆర్పీ ఠాకూర్ వీరిద్దరి మధ్యనే ప్రధాన పోటీ జరుగుతుందని తెలుస్తుంది. రమణ మూర్తి పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంది, దీనితో రమణ మూర్తి పై దృష్టి తక్కువే అని చెప్పుకోవచ్చు. అవినీతి నిరోధక శాఖ డీజీ గా విధులు నిర్వహిస్తున్న ఆర్పీ ఠాకూర్ కి ఇంకా మూడేళ్ల పదవీ కాలం ఉంది.

ఈ పరిణామాలతో కొత్త డీజీపీగా తమ పేర్లు పరిశీలించాలని ఠాకూర్, సవాంగ్ లు సిఎంను కోరుతున్నారు. గతంలో ఠాకూర్ కడప జిల్లా ఎస్పీగా, అనంతపురం డీఐజీగా, రాయలసీమ ఐజీగా విధులు నిర్వహించాడు. మంచి పబ్లిక్ రిలేషన్ కలిగిన ఆర్పి ఠాకూర్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. డిల్లీ స్థాయిలో గట్టి పరిచయాలు ఉన్న ఠాకూర్ ఆ దిశంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

గౌతం సవాంగ్ చిత్తూరు ఎస్.పి.గా, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా, వరంగల్ ఎస్పీగా పని చేశారు. గతంలో సవాంగ్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు. వీరిద్దరి మధ్యన ఉన్న పరిచయంతో సిఎం సవాంగ్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు సవాంగ్ కూడా తనకు తెలిసిన విధానంలో సిఎం వద్దకు తన పేరు పంపారు. సవాంగ్ ట్రాక్ రికార్డ్, సిఎంతో ఉన్న గత పరిచయం కారణంగా ఆయనకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అయితే ఎ.సి.బి డిజిగా విధులు నిర్వర్తించిన ఠాకూర్, మంచి పనితీరు కనబరిచారనే అభిప్రాయం కూడా ఉంది. మూడేళ్ళ పదవీ కాలం ఉన్న ఠాకూర్ కు అవకాశం ఇస్తారా లేక ఐదేళ్లు పదవీ కాలం ఉన్న సవాంగ్ కు ఇస్తారా అనే విషయంలో ఎటూ తేలడం లేదు.

డీజీపీ నియామకం పూర్తి రాజకీయ నియామకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఎవరికి పట్టం కడతారన్న అంశంపై విస్తృత చర్చ జరుగుతుంది. పదవి విరమణ సమయానికి ముందే వారిని బదిలీ చేసి కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వవచ్చు. చివరి నిముషం వరకు ఎలా వ్యవహరిస్తారన్న అంశంపై గతంలో చేసిన విదంగానే వ్యవహరిస్తారా లేక పెద్ద పదవి కాబట్టి ముందే ఏదైనా సమాచారమిస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే రాజకీయాంశాలను దృష్టిలో పెట్టుకొని, రాబోయే ఎన్నికల్లో తమకు అనువైన అధికారిని నియమించుకుంటారన్న సమాచారం, అయితే అనువైన అధికారిగా పరిచయాల దృష్ట్యా గౌతమ్ సవాంగ్ కు ఉండటంతో సవాంగ్ కె పట్టం కడతారని ప్రచారం జరుగుతుంది.