ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. ఇంటర్ కాలేజీలను తెరిచేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆగస్టు 3 నుంచి కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోండి. ఈ విద్యాశవంత్సరానికి మొత్తం 196 పనిదినాలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు 2021 అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేసిన ఉన్నత విద్యా శాఖ, సీబీఎస్ఈ తరహాలో పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని పేర్కొంది.
కళాశాలల్లో ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహించాలని, రెండో శనివారం కూడా కాలేజీలను నడిపించాలని తెలిపింది. పండగల సందర్భంగా ఒకటి లేదా రెండు రోజుల సెలవు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. విద్యార్థులకు యూనిట్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఆన్ లైన్ పాఠాల నిమిత్తం వీడియోలను రూపొందించి విడుదల చేస్తామని వెల్లడించింది. యధావిధిగా మార్చిలోనే వార్షిక పరీక్షలు ఉంటాయని విద్యా శాఖ స్పష్టం చేసింది.