ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.
తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
గత ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు.
సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయి.
ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
నోటీసుల ప్రకారం రేపు పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఆయన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది.
ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రేపటి పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.