ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. 151 ఎమ్మెల్యే సీట్లు.. 22 లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. ఇక, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఇదే సమయంలో జమిలి ఎన్నికల నిర్వహణ పైన కేంద్రం అడుగులను జగన్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన పోరాటం చేస్తూ ప్రతిపక్ష పార్టీ టీడీపీ తిరిగి ప్రజల్లో నిలబడాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే రాజధాని అమరావతి.. పోలవరం పనుల నిలుపదల..పీపీఏల సమీక్ష వంటి అంశాల మీద ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు టీడీపీ కార్యకర్తల మీద దాడులను చూపుతూ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్దం అయింది.
చంద్రబాబు అగ్రెసివ్ రాజకీయాలు చేయడం వెనుక అసలు రహస్యం కూడా అదేనని తెలుస్తుంది. అందుకే పార్టీ వీడి వెళ్తున్న నేతలను వారించి .. భవిష్యత్ మీద భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతీ అంశం మీద ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపటంతో పాటుగా పోరాటాలకు సిద్దం అవుతున్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని.. మరో మూడేళ్లు మాత్రమే వైసీపీ అధికారంలో ఉంటుందనే ప్రచారం ద్వారా పార్టీలో తిరిగి జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు సైతం అదే వాదన తెర మీదకు తీసుకురావటం ద్వారా ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకే మరో సారి రాజకీయం వేడెక్కుతోంది. జమిలి ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల అధినేతలతో జమిలి ఎన్నికల నిర్వహణ పైన సమావేశం నిర్వహించింది. అందులో దాదాపు అందరు మద్దతు ప్రకటించారు. అది అమలైతే 2022 లోనే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. దీంతో.. మరో మూడేళ్లు మాత్రమే ఎన్నికలకు సమయం ఉందని చెప్పటం ద్వారా పార్టీ నేతలను అప్పుడే ఎన్నికలకు సమాయత్తం చేయటం కోసమే చంద్రబాబు పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పటం కోసం..ప్రతిపక్ష పార్టీ గా నిరసలకు సిద్దం అవుతోంది.