telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అబ్దుల్ స‌లాం కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం ‌

పోలీసుల వేధింపుల కార‌ణంగా నంద్యాల‌లో కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకున్న అబ్దుల్ స‌లాం కుటుంబానికి ప్ర‌భుత్వం రూ. 25 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించి త‌క్ష‌ణ‌మే అందించింది. సాయానికి సంబంధించిన చెక్కును ప్ర‌భుత్వం త‌ర‌ఫున హోంమంత్రి సుచ‌రిత బాధిత కుటుంబానికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ వెంటనే స్పందించార‌ని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘ‌ట‌న‌పై ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్నారు. ఇద్దరు అధికారులతో విచారణ కమిటీని నియమించిన‌ట్లు హోంమంత్రి సుచ‌రిత వెల్ల‌డించారు. అన్ని వర్గాలను రక్షించేందుకు ఏపీ పోలీసు శాఖ పని చేస్తోందని, కేసుల విచారణలో బాధితుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించకూడదని ఆమె సూచించారు. అబ్దుల్ సలాం ఆత్మహత్యకు సీఐ, హెడ్‌ కానిస్టేబుల్ వేధింపులే కార‌ణ‌మ‌ని తేలిన‌ట్లు ఆమె ప్ర‌క‌టించారు. నిందితులను ప్రభుత్వం ఎప్పటికీ కాపాడదు. రాజధాని రైతుల కేసులు, అబ్దుల్‌ సలాం ఆత్మహత్య కేసు ఒకటి కాదని అన్నారు. రాష్ట్రం న‌లుమూల‌ల్లో నమోదైన వివిధ కేసు‌ల్లో పోలీసుల అత్యుత్సాహంపై తక్షణమే స్పందించిన‌ట్టు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌న్నీ ఒక‌దానికొక‌టి సంబంధం లేనివ‌ని, బాధితులను కులాల వారీగా విభజించడం త‌గ‌ద‌న్నారు. పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తే జిల్లా పోలీసు కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. బ‌ల‌వంతంగా ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని అన్నారు.

Related posts