telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం : 43 వేలు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల‌కు మేలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు ఆరు వేల రూపాయలు ఈ అలవెన్స్ కింద అదనంగా చెల్లించనున్నారు.

ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్ లలో పనిచేసే పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. తమ జీతాలు పెంచాలంటూ మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్య భృతిని కూడా తమ డిమాండ్లలో కార్మికులు ప్రస్తావించారు. దీనిపై మంత్రులు బొత్స సత్యనారాయణతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో భేటీ అయి వారి సమస్యలపై చర్చించారు.

మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ ను వారి సమస్యలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రస్తుతం మున్సిపల్ పారిశుద్ద్య కార్మికులకు 15 వేలు జీతం వస్తుంది. దీనికి అదనంగా ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ కింద ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.

దీంతో వారి నెలవారీ జీతం 21 వేల రూపాయలు కానున్నాయి. అలాగే జీవో నెంబరు 233 ద్వారా ఇస్తున్న‌ ఆరోగ్యభృతిని కూడా ప్రభుత్వం చెల్లించనుంది.

తాజా ఉత్తర్వులతో దాదాపు 43 వేలమందికి పైగా కార్మికులకు మేలు జరగనుంది. ఈ ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల కార్మికులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Related posts