ఏపీలో ఉపాధ్యాయ పోస్టు ల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 7,902 పోస్టులు జనరల్ డీఎస్సీలో నోటిఫై చేసినవి కాగా, 602 పోస్టులు స్పెషల్ డీఎస్సీలో నోటిఫై చేసిన పోస్టులు ఉన్నాయి.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యం కానున్నాయి. గతానికి భిన్నంగా పలు ఇతర ప్రభుత్వ విభాగాలు ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలిసి ఉండటం తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి రావడమే ఇందుకు కారణమని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్ ఈ నెల 23 వరకూ అమల్లో ఉందన్న అభిప్రాయంతో అప్పటి దాకా సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టేందుకు సంబంధిత విభాగాలు ముందుకు రావడం లేదని సమాచారం.
గత డీఎస్సీలలో కేవలం పాఠశాల విద్యకు సంబంధించిన పోస్టులతోనే డీఎస్సీ నిర్వహించినందున వివిధ ప్రక్రియలు షెడ్యూల్ ప్రకారమే పూర్తయ్యేవి. కానీ ఈ సారి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్య తదితర విభాగాల నుంచి కూడా సమాచారం రావాల్సి ఉండటంతో ఆలస్యం అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది.డీఎస్సీ-2018 నియామకాలు మే 15 నాటికి పూర్తిచేయాలని పాఠశాల విద్యాధికారులు తొలుత కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. కొత్త టీచర్లకు మే 29 నుంచి జూన్ 9 వరకు శిక్షణ ఇవ్వాలని భావించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12న కొత్త టీచర్లు విధుల్లో చేరేలా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.