telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సత్యసాయి జిల్లాలో ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ప్రస్తుతం కుటుంబ సమేతంగా పారిస్‌ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొని, కీలక ఆదేశాలు జారీ చేశారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

గురువారం ఉదయం ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ప్రయాణిస్తోన్న ఆటోపై ప‌డింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది లో ఐదుగురు మహిళా కూలీలు సజీవదహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

ఈ ప్రమాదంపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు..  గాయ‌ప‌డిన వారికి ధర్మవరం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా మహిళలేనని గుర్తించారు. 

మృతిచెందిన వారిని గుడ్డంపల్లి వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోట్లకు చెందిన కుమారిగా గుర్తించారు.పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

Related posts