telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నేడే పోలవరానికి జగన్..

cm jagan

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇవాళ పోలవరం రానున్నారు. మొదట అక్కడ ప్రాజెక్టు పనులు ఎంత వరకు వచ్చాయో స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు సీఎం జగన్. గత కొద్ది రోజులుగా పోలవరం ప్రాజెక్టుపై అనేక అంశాలు చర్చనీయాంశం కావడంతో.. సీఎం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిసారి సీఎం ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం స్పిల్ వేలో రెండు లక్షల 17వేల  క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. గేట్ల ఏర్పాటులో కీలకమైన 48 ట్రూనియన్ భీంలకు గాను 30 నిర్మాణాలను పూర్తి చేశారు. కరోనా కాలంలోనూ లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనితో పాటు స్పిల్ ఛానల్ పనులు, అదేవిధంగా 10 లక్షల  క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు. కేంద్రం నుంచి నిధుల విషయంలో పడిన మెలికపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవలే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌తో మంత్రులు బుగ్గున, అనిల్‌ కుమార్‌ భేటీ కాగా.. కేంద్రం సానుకూలంగా స్పందించటం ప్రభుత్వానికి కాస్త ఊరట కలిగించింది.

Related posts