telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం..

*కాసేప‌ట్లో అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బ‌డ్జెట్‌..
*సంక్షేమ ప‌థ‌కాల‌కు అధిక‌ప్రాధాన్య‌త‌..

ఏపీ శాస‌న‌మండ‌లి శుక్రవారం ఉదయం సమావేశం అయ్యింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ భేటీలో ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది .

శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి రాష్ట్రవార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయానికి మండలిలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి బడ్జెట్‌ చదవనున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్తి అయిన వెంటనే శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు ప్రవేశపెట్టనున్నారు.

ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. సచివాలయంకు చేరుకున్న ఆర్థిక మంత్రి బుగ్గన.. అధికారులు. బడ్జెట్‌ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు.

వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు ఉంటాయన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను నిధులు కేటాయించం అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకిచ్చిన హామీల అమలు దిశగా బడ్జెట్‌ రూపొందించామని చెప్పారు..

బడ్జెట్‌లో ముఖ్యంగా నవరత్నాలకు అధిక నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అటు జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి కూడా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉండనున్నట్లు సమాచారం.

ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల ప్రయోజనాలను కొనసాగించడమే లక్ష్యంగా అన్ని వర్గాలకు అండగా నిలిచేలా 2022 – 23 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నందున సంక్షేమానికే పెద్దపేట వేయనున్నారు.

ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు కోట్ల చొప్పున బడ్జెట్ లో 350 కోట్లు కేటాయించనున్నారు. వ్యవసాయరంగానికి 31 వేల కోట్ల కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం 10 వేల కోట్లు, పేదల ఇళ్ల నిర్మాణానికి 4,500 కోట్లు, వైఎస్సార్ ఆసరాకు 6,400 కోట్లు, వైఎస్సార్ చేయూత పథకానికి 4,200 కోట్లు, అమ్మఒడి పథకానికి 6,500 కోట్లు, జగనన్న విద్యాదీవెన పథకానికి 2,400 కోట్లు సున్నా వడ్డీ పథకానికి 800 కోట్లు, కాపు నేస్తం పథకానికి 500 కోట్లు కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలే కాకుండా కొత్తవాటికి ఏమైనా కేటాయింపులు చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా బడ్జెట్‌ ఉంటుందనే సంకేతాలు ఇదివరకే పంపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పధకాలపై ఎక్కువగా కొనసాగింపు ఉంటుందని తెలుస్తోంది.

Related posts