telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో నూతన విద్యా విధానానికి కెబినెట్‌ ఆమోదం

నాడు -నేడు కార్యక్రమం కింద ఏపీలోని పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైగా పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామని అన్నారు. తొలి విడతగా 15 వేలకు పైగా స్కూళ్లను అభివృద్ధి చేశామన్నారు. పాఠశాలల్లో దశల వారీగా పనులు నిర్వహణకు రూ. 21 వేల కోట్లు చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. 34 వేల స్కూళ్లలో 1 నుంచి 5 వరకు విద్యాబోధన జరుగుతోందన్నారు. కొత్త విద్యా విధానాన్ని ఏపీ కెబినెట్ ఆమోదించిందని అన్నారు. కొత్త విద్యా విధానం వల్ల స్కూళ్ల మూసివేత ఉండదని, ఉపాధ్యాయుడి ఉద్యోగమూ తీసివేసే ప్రసక్తే ఉండదన్నారు. పీపీ-1, పీపీ-2 మొదలుకుని హైస్కూల్ ప్లస్ వరకు పాఠాశాలలు ఉంటాయి. హైస్కూల్ ప్లస్ కేటగిరిలో మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన ఉంటుంది. ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్ధులకు ఒకటీ లేదా ఇద్దరు టీచర్లతో విద్యా బోధన జరుగుతుందని అన్నారు.

ప్రస్తుతం అమలవుతున్న విద్యా విధానంపై సర్వే నిర్వహించగా విద్యా ప్రమాణాలు సరిగా లేవనే విషయం వెల్లడైందని, విద్యార్ధుల జీవితాలను మనమే నాశనం చేస్తున్నామనే ఫీడ్ బ్యాక్ వచ్చిందని అన్నారు. అందుకే ప్రస్తుత విద్యా విధానం మార్చాలనే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఒకేసారి తెలుగు, ఇంగ్లీష్‌లోబోధన ఉండేలా చర్యలు చేపట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. తెలుగు సబ్జెక్ట్ తప్పకుండ ఉంటుంది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదుతున్న సుమారు 4 లక్షలకు పైగా పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆరు లక్షలకు పైగా విద్యార్ధులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు అని పేర్కొన్నారు.

Related posts