telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : టాప్ లేపుతున్న చెన్నై .. ఖాతాలో మరోవిజయం ..

another won to chennai in ipl 2019 match

ధోనీ సారథ్యం కలిసొచ్చిన వేళ మరోసారి..చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అదిరిపోయే విజయం.. గెలుపు దోబూచులాడిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. గురువారం మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. జడేజా (2/20), శార్దూల్‌ ఠాకూర్‌ (2/44), చాహర్‌ (2/33) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో ధోని, రాయుడు సత్తా చాటడంతో లక్ష్యాన్ని చెన్నై సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

చెన్నై ఇన్నింగ్స్‌ 152 పరుగుల ఛేదనలో పేలవంగా ప్రారంభమైంది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నాలుగో బంతికే వాట్సన్‌ (0) ఔటయ్యాడు. ధవళ్‌ కులకర్ణి (1/14) అద్భుతమైన బంతితో వాట్సన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కాసేపటికే చెన్నైకి మరో షాక్‌ తగిలింది. ఆర్చర్‌ వేసిన సూపర్‌ త్రోకు రైనా (4) రనౌటయ్యాడు. 3 ఓవర్లకు చెన్నై స్కోరు 10 పరుగులే. ఈ స్థితిలో భారీ షాట్‌కు పోయిన డుప్లెసిస్‌ (7) ఔట్‌ కాగా… కేదార్‌ జాదవ్‌ (1) అతణ్ని అనుసరించాడు. స్టోక్స్‌ పట్టిన కళ్లుచెదిరే క్యాచ్‌కు కేదార్‌ వెనుదిరిగాడు. చెన్నై 24 పరుగులకే 4 వికెట్లు పోగొట్టుకుంది. ఈ స్థితిలో ధోని, రాయుడితో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఆరంభం నుంచి ఎదురుదాడికి దిగిన మహి.. నెమ్మదిగా స్కోరు పెంచాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని అతను సిక్స్‌లు బాదాడు. పరాగ్‌ బౌలింగ్‌లో మహి కొట్టిన ఫ్లాట్‌ సిక్స్‌తో చెన్నై రేసులోకి వచ్చింది. అయితే అర్ధసెంచరీ అయిన తర్వాత మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన రాయుడు.. గోపాల్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌కు వెనుదిరిగాడు. రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి రాగా.. చెన్నైపై ఒత్తిడి పెరిగింది. కానీ ధోని క్రీజులో ఉండడంతో ఆ జట్టు భరోసాగానే ఉంది. ఆఖరి ఓవర్లో గెలవాలంటే చెన్నైకి 18 పరుగులు అవసరం అయ్యాయి. ఈ స్థితిలో తొలి బంతికి జడేజా (9 నాటౌట్‌) కళ్లుచెదిరే సిక్స్‌ కొట్టగా.. తర్వాత బంతి నోబాల్‌ అయింది.. దీనికి జడేజా ఒక పరుగు తీశాడు. ఫ్రీహిట్‌ బంతికి రెండు పరుగులు చేసిన ధోని.. మూడో బంతికి బౌల్డ్‌ అవడంతో మ్యాచ్‌ మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది. ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టాల్సి రాగా.. శాంట్నర్‌ (10 నాటౌట్‌) సిక్స్‌ బాది చెన్నైని గెలిపించాడు.

రాజస్థాన్‌కు ఓపెనర్లు రహానె (14; 11 బంతుల్లో 3×4), బట్లర్‌ (23; 10 బంతుల్లో 4×4, 1×6) శుభారంభమే ఇచ్చారు. ఈ జోడీ 2.5 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 31 పరుగులు జత చేశారు. అయితే అద్భుతమైన బంతితో చాహర్‌.. రహానెను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఊపు మీద కనిపించిన బట్లర్‌ను శార్ధూల్‌ ఔట్‌ చేయగా.. శాంసన్‌ (6)ను స్పిన్నర్‌ శాంట్నర్‌ పెవిలియన్‌ పంపడంతో రాజస్థాన్‌ 53/3తో నిలిచింది. ఈ స్థితిలో స్మిత్‌ (15; 22 బంతుల్లో), త్రిపాఠి (10) కాసేపు నిలబడినా.. వేగంగా ఆడలేకపోయాడు. దీనికి తోడు జడేజా వరుస ఓవర్లలో త్రిపాఠి, స్మిత్‌లను ఔట్‌ చేయడంతో రాజస్థాన్‌ 79/5తో కష్టాల్లో పడిపోయింది. 19 ఓవర్లకు రాజస్థాన్‌ స్కోరు 7 వికెట్లకు 133 పరుగులు మాత్రమే. ఈ స్థితిలో ఆఖరి ఓవర్లో శ్రేయస్‌ గోపాల్‌ (19 నాటౌట్‌; 7 బంతుల్లో 2×4, 1×6) రెండు ఫోర్లు, సిక్స్‌ బాది 18 పరుగులు రాబట్టాడు.

another won to chennai in ipl 2019 matchనేటి మ్యాచ్ : కలకత్తా vs ఢిల్లీ మధ్య రాత్రి 8 గంటలకు జరుగుతుంది.

Related posts