ప్రపంచంతో పోటీ పడుతూ భారతదేశం ఎప్పటికప్పుడు ముందడుగులు వేస్తూనే ఉంది. తాజాగా, అత్యంత వేగవంతమైన ఉపరితల రవాణా వ్యవస్థ హైపర్‌లూప్‌ను పూణే-ముంబయి మధ్య ఏర్పాటు చేసేందుకు మరో ముందడుగు పడింది. ఈ మేరకు వర్జిన్ హైపర్‌లూప్ వన్-డీపీ వరల్డ్ సంస్థతో కూడిన కన్సార్టియం ఒరిజినల్ ప్రాజెక్ట్ ప్రాపొనెంట్ (ఓపీపీ) విధానంలో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం అంగీకరించింది. భారత్‌లో ప్రముఖ పోర్ట్, లాజిస్టిక్ వ్యాపారం నిర్వహిస్తున్న డీపీ వరల్డ్ అనే సంస్థ ముంబయి-పుణే హైపర్‌లూప్ ప్రాజెక్టుపై మొదటి దశ పూర్తికి 500 మిలియన్ డాలర్లు వెచ్చించనుంది. ముంబయి-పుణే మధ్య హైపర్‌లూప్ ఏర్పాటుకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆసక్తి చూపిన వారిలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఉందని హైపర్‌లూప్ వన్ తెలిపింది. దీన్ని ప్రజల కోసం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా అభివృద్ధి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది.
ప్రపంచంలోనే మొదటి హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ మహారాష్ట్రలో ఏర్పాటు కాబోతోంది. ఈ వ్యవస్థ ప్రపంచమంతా వ్యాప్తి చెందేందుకు సదరు ప్రాజెక్టే నాంది పలకబోతోంది. ఇది మనకు గర్వకారణం.. అని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వ్యాఖ్యానించారు. ”ఈ ప్రాజెక్టు వల్ల వేల కొద్దీ ఉద్యోగాలు లభించడంతో పాటు , ఈ ప్రాంతంలో 36 బిలియన్ డాలర్ల మేర సామాజిక ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. అంతేకాక భవిష్యత్తులో హైపర్‌లూప్ విడిభాగాల తయారీ కర్మాగారాలు ఏర్పడి విదేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. వాణిజ్యపరంగా ఈ కారిడార్ ‘మెగా-ఎకనమిక్ రీజియన్’గా రూపాంతరం చెందుతుంది. ‘ఓపీపీ’ విధానం ద్వారా ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం.”అని వర్జిన్ హైపర్ లూప్ వన్ ప్రతినిధులు తెలిపారు. హైపర్‌లూప్ ప్రాజెక్టు నిర్మితమైతే పుణే నుంచి ముంబయికి కేవలం 35 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. రోడ్డు ద్వారా అయితే మూడున్నర గంటల సమయం పడుతుంది. ఏటా ఈ మార్గంలో 75 మిలియన్ల మంది ప్రయాణం సాగిస్తుంటారు. 2026 కల్లా 130 మిలియన్ల మంది రాకపోకలు సాగిస్తారని అంచనా.
చంద్రబాబు నివాసంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు