నగరంలోని పంజాగుట్ట చౌరస్తాలో ఒక ఆటో డ్రైవర్ మరో ఆటో డ్రైవర్‌ను దారుణంగా పొడిచి చంపాడు. రద్దీ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. అది చూసి జనం భయంతో పరుగులు తీశారు. దాడిలో తీవ్ర గాయాలపాలై రక్తమోడుతున్న ఆటో డ్రైవర్ రోడ్డుపై పరుగులు పెడుతూ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కుప్పకూలిపోయాడు. పంజాగుట్టకు చెందిన అన్వర్ (32), ప్రతాప్‌నగర్‌కు చెందిన రియాసత్ అలీ (35) స్నేహితులు. ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. బుధవారం సాయంత్రం పంజాగుట్ట ఆటోస్టాండ్ వద్ద ఈ విషయంలో ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. అది మరింత పెరగడంతో ఆగ్రహం పట్టలేని రియాసత్ కత్తితో అన్వర్‌పై దాడిచేశాడు. పొట్టలో విచక్షణ రహితంగా పొడిచాడు.
దానితో ప్రాణాలు రక్షించుకునేందుకు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌లోకి పరుగులుపెట్టిన అన్వర్ అక్కడ కుప్పకూలిపోయాడు. అతడిని వెంటాడుతూ వచ్చిన రియాసత్ పోలీసులకు లొంగిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అన్వర్‌ను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు అంబులెన్స్‌ను రప్పించినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు మాట్లాడుతూ.. తన భార్యకు ఎయిడ్స్ రక్తం ఎక్కించేందుకు అన్వర్ ప్రయత్నిస్తున్నాడని, అందుకే చంపేశానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.