హైదరాబాద్ లోని హైటెక్ సిటీకి ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరో మెట్రో రైలు నడపనున్నారు. హైటెక్ సిటీ మెట్రో కారిడార్‌లో రద్దీ నేపథ్యంలో అదనంగా మరో రైలును నడుపుతున్నామని మెట్రో ఎం.డి. ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఐటీ కారిడార్ నుంచి క్రమంగా మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పలు స్టాఫ్ట్‌వేర్ కంపెనీలు వారి ఉద్యోగుల కోసం ఎక్కువ సంఖ్యలో షటిల్ సర్వీసులను నడుపుతుండడంతో మెట్రోలో వచ్చే ఐటీ ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రో రైళ్లు ఎంతో రద్దీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రద్దీ సమయాల్లో అదనంగా మరో మెట్రో రైలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఇప్పటి వరకు మెట్రో ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ 2.75 లక్షలుగా ఉంది. అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు నడుస్తున్న మెట్రో రైళ్లలో రద్దీ సమయాలైన ఉదయం 9నుంచి 11 గంటల మధ్య 14,000 మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో రైలును అదనంగా నడపం ద్వారా మరింత ఎక్కువ మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. అదనంగా ప్రవేశ పెట్టిన మెట్రో రైలు హైటెక్ సిటీ వద్ద రివర్సల్ సదుపాయం అందుబాటులోకి వచ్చే వరకు నడుస్తుందని మెట్రో ఎం.డి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ప్రజల విశ్వాసాన్ని వైసీపీ పొందలేకపోతుంది: పురందేశ్వరి