ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. తాము చేసిన దుర్మార్గాన్ని బట్టబయలు చేసి, పోలీసు కేసు పెట్టిందన్న కోపంతో కొందరు దుండగలు ఒక యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఊహించిన ఈ పరిణామంతో తీవ్ర షాక్‌కు గురైనప్పటికీ ఆ యువతి ధైర్యం కోల్పోలేదు. ఒళ్లంతా మంటలు వ్యాపిస్తూ, ప్రాణాలు కాపాడు కోవడానికి పరుగులు తీస్తూనే ఆమె 112వ నెంబర్‌కు ఫోన్ చేసి, తన పరిస్థితిని వివరించింది. ఆ ఫోన్‌తోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె శరీరం 90శాతం కాలిపోయింది. కళ్లు మూత పడుతూ, నోట మాటరాకుండా, శరీరం పూర్తిగా సహకరించని ఆ స్థితిలోనే ఆమె పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. తనపై దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారన్న అంశాలను వివరించారు. వీటి ఆధారంగానే పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ అమానుష ఘటనపై రాజ్యసభ భగ్గుమంది. యువతిపై జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండిం చింది. ఉన్నావ్‌కు చెందిన ఈ మహిళపై మార్చి నెలలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల ఇంటి నుండి తిరిగి వస్తుండగా వారు ఈ దారుణానికి పాల్పడటంతో పాటు, మొబైల్ ఫోనలో చిత్రీకరించారు. ఈ సంఘటనపై అప్పట్లోనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అరెస్ట్ అయిన నిందితుడికి ఇటీవలే బెయిల్ లభించింది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం రాయబరేలి కోర్టులో జరగనున్న విచారణకు బాధితురాలు వెడుతున్న సమయంలో తాజా దారుణం చోటుచేసు కుంది. పథకం ప్రకారం దుండగులు నిర్మానుష్య స్థలంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఒంటిమీద మంటలతోనే కాపాడమని కేకలు పెడుతూ ఆమె పరుగులు తీసింది. అలా పరుగులు తీస్తూనే 112కు ఫోన్‌చేసి కుప్పకూలిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హుటా హుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు స్టేట్‌మెంటు ఇచ్చిన తరువాత ఆమె స్పృహ కోల్పోయారు. 90శాతం కాలిపోవడంతో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఉన్నావ్‌లోనే బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగార్ 17 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనలో న్యాయం కోసం ప్రయత్నించిన ఆమె తండ్రిని అక్రమ కేసులో ఇరికించారు. చివరకు ఆయన లాకప్‌లోనే మృతి చెందారు. కోర్టుకు వెళుతున్న బాధితురాలిపై కూడా దాడి జరిగింది. ఆ దాడిలో బాధితురాలికి చెందిన ఇద్దరు కుటుంబసభ్యులు మృతిచెందగా, ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
ఆ ప్రముఖ దర్శకుడి బాగోతం త్వరలో బయటపెడతా… బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు