డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తాజాగా తన పూరి మ్యూజింగ్స్‌లో ‘యానిమల్స్’ (జంతువులు) అనే టాపిక్ మీద మాట్లాడారు. “జంతువులను చూసి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. క్షుణ్ణంగా గమనిస్తే ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క క్వాలిటీని మనం గమనించవచ్చు. నేర్చుకునే మనసుంటే నేర్చుకోవచ్చు. మనం ప్రేమించిన మనిషికి విధేయంగా ఉండాలి. తన కోసం నిలబడాలి. ప్రేమించడం అంటే ఏంటి? అనే దాన్ని కుక్క దగ్గర నుండి నేర్చుకోవచ్చు. ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ఎక్కువ ఆలోచించొద్దు. నిన్ను భయపెట్టే విషయాన్నిచెసేయ్ అనే విషయాలను కోతుల నుండి నేర్చుకోవచ్చు. ఎందుకంటే అవి కరెంట్ తీగను పట్టేసుకుంటాయి. డబ్బాలో తల పెట్టేస్తాయి.. ఒకటని కాదు. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎలా బతకాలి.. ఎలా నిలబడాలి? తిన్నా తినకపోయినా మన జర్నీ మాత్రం ఆగకూడదనే విషయాలను ఒంటెల నుండి నేర్చుకోవాలి. పెద్ద పెద్ద ఎడారులను అవి దాటేస్తాయి.
ఏయ్ నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేయబోతున్నావో. ఎవ్వరికీ చెప్పొద్దు. ఎవరితో డిస్కస్ చేయొద్దు. కామ్‌గా చెసేయ్.. ఇది టైగర్ లక్షణం. ఎంతమంది ఎన్నిసార్లు డిస్ట్రబ్ చేసినా, ఎన్నిసార్లు కిందకు లాగినా, వదలొద్దు. అది మన డిక్షనరీలోనే లేదు… స్పైడర్ లక్షణం. లైఫ్ ఎంత బరువైపోయినా కామ్‌గా ఉండు, లైఫ్ పైన కంప్లైంట్ చేయొద్దు. బాధ్యతలు తీసుకో… గాడిద లక్షణం. తమ్ముడు ఒక్క క్షణం వేస్ట్ చెయ్యొద్దు, నిరంతరం కష్టపడు, ఎవ్వరిపైనా ఆధారపడొద్దు. వర్షాకాలం కోసం దాచుకోకపోతే సంకనాకిపోతావ్, పొదుపు చేసుకో.. ఈ డైలాగ్ చీమది. సైలెంట్‌గా ఉండు, ఫోకస్‌గా ఉండు.. కన్ను తిప్పొద్దు. మన ఫోకస్ ఎప్పుడూ మన గోల్‌పైనే ఉండాలి.. ఇది చిరుత లక్షణం. నువ్వు నల్లగా ఉండొచ్చు, అందవికారంగా ఉండొచ్చు. అయితే ఏంటి? నేను ఇలాగే ఉంటాను. నేను నా గురించి గర్వంగా ఫీల్ అవుతాను.. ఇది పంది డైలాగ్. నీ బుద్ధిని నమ్ము. అదెప్పుడూ తప్పు చేయదు. ఇది మొసలి డైలాగ్. ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు వంద రకాలుగా ఆలోచించు. టైమ్ చూసి కొట్టాలి. కొడితే తిరుగుండకూడదు.. ఇది నక్క. ఎంత లావుగా ఉన్నా పర్లేదమ్మా గ్రేస్ ఫుల్‌గా ఉండటం, గ్రేస్‌ఫుల్‌గా నడవటం నేర్చుకో ఎవడేం పీకుతాడు… ఇది ఏనుగు. ఎనర్జీ నా బ్లడ్‌లో ఉంది. ఫ్రెండ్‌షిప్ కోసం గర్వంగా నిలబడతా.. నా ప్రాణమిస్తా, నాతో ఉండు ఇది గుర్రం. నువ్వెంత శక్తివంతుడివైనా కామ్‌గా ఉండటం, అవసరం అయితేనే మాట్లాడటం అనేది సింహం నుండినేర్చుకోవచ్చు. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. అవతలవాడు చెప్పేది అర్థం చేసుకో…ఇది డాల్ఫిన్స్. అన్నా ఇది చిన్న జీవితం, హ్యపీగా దొర్లుతూ గడిపేస్తాం. రోజంతా నవ్వుతూనే ఉంటాం. ఇదెవరో తెలుసా! పాండా. ఇలా చెబుతుంటే ఇది కామెడీగా అనిపించొచ్చు. ఏంటి చిన్నపిల్లావాళ్లకు చెబుతున్నాడేంటని అనిపించొచ్చు. కానీ వీటిలో ఏ రెండు క్వాలిటీస్ మీలో ఉన్నా, లైఫ్‌లో హీరో అవుతారు” అంటూ చెప్పుకొచ్చారు పూరి.