telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

పుత్తూరు : .. పశువులకు విచిత్ర రోగం.. పడుకున్నవి పడుకున్నట్టే మృత్యువాత..

animals died with unknown reason

రాత్రి పడుకున్న ఆవు తెల్లారేసరికి చనిపోతోంది. పశువుల డాక్టరు మాఊరికి వచ్చి మూడేళ్లకు పైగా అవుతోంది. ఏదైనా ఉంటే అటెండర్‌కు ఫోన్‌ చేస్తాం. ఆయన వచ్చి రెండు సెలైన్లు పెడతాడు. అయినా తెల్లారేసరికి చనిపోతున్నాయి. వేణుగోపాలసాగర్‌ ప్రాజెక్టులో మా భూములన్నీ పోయాయి. బతికేందుకు వేలకు వేలు అప్పులు చేసి నాలుగు ఆవులు, గేదెలను కొనుక్కున్నాం. ఒక్కొక్కటి ఇలా చనిపోతుంటే మేం ఎట్లా బతకాలయ్యా.. ఆ మాయదారి రోగమేదో మాకు వస్తే బాగుండేది.. ఈ బాధలన్నీ లేకుండా హాయిగా ఊపిరి వదిలేస్తాం.. ఇదీ పుత్తూరు మండల పరిధిలోని తడుకు పంచాయతీకి చెందిన పాడి రైతుల ఆవేదన. భూములు కోల్పోయాక రైతులు పశుపోషణ ఒక్కటే జీవనాధారమైంది. దీంతో అప్పులు చేసి మరీ రైతులు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారు. గ్రామంలో ప్రస్తుతం వెయ్యికి పైగా పశువులు ఉన్నాయి. రెండేళ్లలో దాదాపు 40 పశువులు చనిపోయాయి. రెండు నెలలుగా వారానికి రెండు మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. రైతుల కథనం మేరకు.. ”పశువులు ఆరోగ్యంగానే ఉంటున్నాయి. మేత కూడా బాగానే తీసుకుంటున్నాయి. రాత్రికి రాత్రే అస్వస్థతకు గురవుతున్నాయి.

నాలుగు గేదెలు, ఆవులు ఉన్న పాడి రైతుకి ఇప్పుడు ఒక్కటి కూడా మిగలలేదని వాపోతున్నారు. కొనుగోలుకు చేసిన రుణం అలాగే ఉందని, పశువులు మాత్రం మృతి చెందుతున్నాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పశుసంపద ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామానికి పశువైద్యాధికారి వచ్చి మూడేళ్లుకు పైగా అవుతోందని పాడిరైతులు ఆరోపిస్తున్నారు. ఏ రోగమొచ్చినా అటెండర్‌ దిక్కుగా మారారని పేర్కొంటున్నారు. ఇన్ని పశువులు మృతి చెందుతున్నా పశువైద్యశాఖ వైద్యులు గ్రామానికి రాకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. కేవలం పాడిపైనే ఆధారపడి బతుకుతున్న తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఇకనైనా పశువైద్య శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై పుత్తూరు పశువైద్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్రమౌళి గౌడ్‌ వివరణ కోసం ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Related posts