telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత ప్రధానికి థాంక్స్ చెప్పిన విండీస్ క్రికెటర్…

వెస్టిండీస్ ఆల్‌రౌండర్. కోల్‌కతా నైట్‌రైడర్స్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రస్సెల్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. జమైకా దేశానికి కరోనా వ్యాక్సిన్​ను అందించడం పట్ల ఈ విండీస్ క్రికెటర్ హర్షం వ్యక్తం చేశాడు. ‘ప్రధాని నరేంద్ర మోదీకి, భారత హై కమిషన్​కు నా కృతజ్ఞతలు. వ్యాక్సిన్​లు వచ్చేశాయి. మేమంతా చాలా ఉత్సాహంతో ఉన్నాం. ప్రపంచం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటే చూడాలని ఆశిస్తున్నా. భారత్, జమైకా ఎల్లపుడూ మంచి మిత్రులు, సోదరులు. మీరంతా అక్కడ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా.’అని ఆ వీడియోలో రస్సెల్ చెప్పుకొచ్చాడు. అయితే 50 వేల వ్యాక్సిన్​లు పంపడం పట్ల ఈ నెల ప్రారంభంలో భారత్​కు జమైకా కృతజ్ఞతలు తెలిపింది. “భారత ప్రభుత్వం పంపించిన 50 వేల ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్​లు జమైకా చేరుకున్నాయని తెలపడానికి సంతోషిస్తున్నా. అవసరం ఉన్న సమయంలో మాకు సాయం చేసిన భారత ప్రభుత్వం, ప్రజలకు మా ప్రేమను తెలియజేస్తున్నా” అంటూ ఆ దేశ ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం రస్సెల్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 కి సిద్ధమవుతున్నాడు.

Related posts