telugu navyamedia
ఆంధ్ర వార్తలు

త‌మ డిమాండ్లు అంగీకరిస్తేనే ప్రభుత్వంతో చర్చలు..

ఏపీలో సమ్మె సైర‌న్ మోగింది..ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు ఉద్యోగసంఘాలు నోటీసు ఇచ్చింది.

ఏక పక్షంగా పీఆర్సీ జీవోలను అమల్లోకి తెచ్చినందుకే ఉద్యమ బాట పట్టినట్టు నోటీసులో ప్రస్తావించారు ఉద్యోగులు. తాము సమ్మె చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ఆ బాధ్యత ప్రభుత్వానిదేనన్న అంశాన్ని సమ్మె నోటీసులో ప్రత్యేకంగా ప్రస్తావించాయి.

ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం ఉద్యోగ సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు… సమ్మెకు వెళ్తామని తాము ఎప్పుడూ అనుకోలేదని ఏపీ పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. తమ రెండు డిమాండ్లను అంగీకరిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు.

తమ డిమాండ్లు పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల్లో భాగంగా తమ సమస్యలు ఆలకించామని ప్రభుత్వం చెబుతోందని.. కాని పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు.

తమనే కాదు.. పౌరసమాజాన్ని కూడా సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.ఈనెల తమకు పాత జీతాలనే చెల్లించాలని సీఎస్‌ను గతంలో కోరామని ఏపీ పీఆర్సీ సాధన సమితి నేతలు చెప్పారు. ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ వేసిందని విన్నామన్న నేతలు.. నిన్నటి రౌండ్‌టేబుల్‌ భేటీలో వచ్చిన అభిప్రాయం మేరకు సమ్మె నోటీసు ఇచ్చామని స్పష్టం చేశారు.

తాము చేస్తున్నది ఆషామాషీ ఉద్యమం కాదు.. “మా డిమాండ్లు పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు ఇచ్చారు. మా సమస్యలు విన్నామని ప్రభుత్వం చెబుతోంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇదేదో ఆషామాషీ ఉద్యమం కాదు. 13 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్ల ఉద్యమని తెలిపారు.

అంతకుముందు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగ సంఘ నేతలు తిరస్కరించారు.. కమిటి పరిధి ఏంటో తెలియనప్పుడు చర్చలకు ఎలా వెళ్తామని ప్రశ్నించారు.. ఇప్పటి వరకు 12సార్లు చర్చలకు వెళ్లామని.. అయినా ప్రయోజనం లేనప్పుడు ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తూ సమ్మె వైపే మొగ్గు చూపిన‌ట్లు పీఆర్సీ సాధన సమితి తేల్చి చెప్పింది

Related posts