telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయిన స్పీకర్‌ తమ్మినేని…

అసెంబ్లీ సమావేశాల సన్నాహాక సమావేశం నిర్వహించారు స్పీకర్‌ తమ్మినేని, మండలి ఛైర్మన్‌ షరీఫ్‌. వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు లేకుండానే సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రశ్నోత్తరాలను నిర్వహించాలని ఇప్పటికే మండలి ఛైర్మన్‌ కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖ రాశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా వీలైనంత త్వరగా అసెంబ్లీ సమావేశాలను ముగించాలని వైద్యారోగ్య శాఖ సూచనలు చేసింది. వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు ప్రశ్నోత్తరాలు లేకుండానే ఉభయ సభలను నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. సభ్యులడిగే ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలివ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఉన్నతాధికారులను స్పీకర్ తమ్మినేని‌, మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రశ్నించారు. వివిధ రూపాల్లో సభ్యుల వేసిన ప్రశ్నలకు సమాధానాలివ్వకుంటే సమాచారం ఎలా అందుతుందని సభాధిపతులు ప్రశ్నించారు. అసెంబ్లీకి వాస్తు మార్పుల్లో భాగంగా కొన్ని గేట్లు మూసేయడంతో ఎవరెవరు.. ఏయే గేట్లల్లో నుంచి రావాలనే అంశంపై చర్చ జరిగింది. స్పీకర్‌, మండలి ఛైర్మన్‌, సీఎంలు గేట్-1 ద్వారా.. మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా గేట్‌-2 ద్వారా సభ ప్రాగంణంలోకి వచ్చేలా రూట్‌ ఖరారు చేశారు. గతంలో మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యేల రాకపోకలకు విడివిడిగా గేట్లు ఉండేవి మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేత వాహానాలను మాత్రమే లోనికి అనుమతించనున్నారు అసెంబ్లీ భద్రతా సిబ్బంది. కరోనా పరిస్థితుల కారణంగా మీడియా పాయింట్‌ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో సుమారు 15 బిల్లులను ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

Related posts