బుల్లితెరపై యాంకర్ గా, వెండితెరపై నటిగా అనసూయ దూసుకుపోతోంది. రంగస్థలం సినిమాతో అనసూయ క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం అనసూయ “కథనం” అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలో అనసూయ తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం అనసూయ అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను నిర్మాతగా మారబోతున్నట్లు అనసూయ ప్రకటించింది. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు తాను సినిమాలు నిర్మిస్తానని అనసూయ తెలిపింది. ప్రస్తుతం ఏదైనా ప్రాజెక్ట్ సిద్ధంగా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారి గురించి అనసూయ స్పందిస్తూ.. “వితండవాదానికి నా అకౌంట్(ట్విట్టర్) పేజీలో స్థానం లేదు. నా ట్విట్టర్ హ్యాండిల్ లో దురుద్దేశంతో అనుచిత కామెంట్లు చేస్తున్నవారందరినీ బ్లాక్ చేస్తున్నా. ఇది నా అకౌంట్. నేను ప్రశాంతంగా ఉండటానికి ఏది కావాలనుకుంటే అది చేసే హక్కు నాకు ఉంది” అని ట్వీట్ చేసింది.