telugu navyamedia
సామాజిక

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరెస్ట్ ఎక్కి చూపించాల్సిందే…

“ఆడపిల్లవు నీకెందుకు ఇంతటి అసాధ్యమైన లక్ష్యాలు? చక్కగా పెళ్లి చేసుకుని ఇంటిపట్టునుండక?” అని చాలామంది అంటుంటారు. ఆ మాటలు నా చెవిన పడ్డ ప్రతిసారి… నా రక్తం సలసల మరుగుతుంది. నా పట్టుదల ఎవరెస్ట్ శిఖరమే అవుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరెస్ట్ ఎక్కి చూపించాల్సిందే… మన తెలుగు తేజాన్ని… ముఖ్యంగా మా మహిళాగర్వాన్ని దిక్కులు పిక్కటిల్లేలా చాటి చెప్పాల్సిందే అనిపిస్తుంటుంది” అంటూ చెప్పలేనంత భావోద్వేగానికి లోనవుతుంటుంది… “మౌంట్ ఎవరెస్ట్” శిఖరాగ్రాన్ని ముద్దాడాలనే మొండి పట్టుదలతో ముందుకు సాగుతున్న అసాధారణ ప్రతిభాశాలి సమీరాఖాన్.

ఆంధ్రప్రదేశ్- అనంతపురంలోని దిగువ మధ్య తరగతి ముస్లిం కుటుంబానికి చెందిన సమీరా… ఇప్పటికే మన దేశంలో ముప్పాతిక రాష్ట్రాలతోపాటు… ఏకంగా 25 దేశాలు చుట్టబెట్టింది. హిమాలయాల్లోని ఏడు వేల మీటర్ల ఎత్తు గల నాలుగు పర్వత శ్రేణులను అలవోకగా అధిరోహించి తన సత్తా చాటుకుంది. ఇప్పుడు ఆకాశంలోకి 8,848 మీటర్లు ఎగబాకి… ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరొందిన “మౌంట్ ఎవరెస్ట్”పై కాలు మోపేందుకు కంకణం కట్టుకుని… అందుకోసం కఠోరంగా కృషి చేస్తోంది. ఇందుకు ఖర్చయ్యేది సుమారు 40 లక్షలు “స్పాన్సర్” చేసే వదాన్యుల కోసం ఎదురు చూస్తోంది.

Andhra Girl With Himalayan Ambitions Wants To Prove Point - Sakshi

రోమాలు నిక్కబొడుచుకునే అడ్వెంచరస్ సినిమాగా మలిచేంత అర్హత కలిగిన లక్ష్యాలు, స్వప్నాలతోపాటు అందుకు అనుగుణమైన అసాధారణమైన కార్యాచరణ, అబ్బురపరిచే జీవనవిధానం కలిగిన సమీరా… చిత్ర ప్రముఖులెవరైనా తనకు చేయూతనిస్తే… చరిత్ర సృష్టిస్తానంటోంది.

ప్రోత్సహించాలే గానీ ఆడపిల్లలు ఎంతటి అసాధ్యాన్నయినా సుసాధ్యం చేయగలరని “మౌంట్ ఎవరెస్ట్” సాక్షిగా నిరూపిస్తానంటోంది. “మౌంట్ ఎవరెస్ట్” ఎక్కడమనే తన మనోభీష్టం నెరవేరాక… తనలా సాహసాలు చేయాలనుకునే ఔత్సాహికుల కలలు సాకారం చేయడం కోసం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ “శిక్షణాసంస్థ” నెలకొల్పాలన్నది తన జీవితాశయమని చెబుతోంది!!

Related posts