ముంబయి: భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కు ‘పీఎం నరేంద్ర మోదీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రీల్ లైఫ్ మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆయన పాత్రలో మనోజ్ జోషి నటిస్తున్నారు. అమిత్ షా పాత్రలో ఆయన ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు.
ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. గత నెలలో 23 భాషల్లో డిజైన్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విడుదల చేశారు. వివేక్ తండ్రి సురేశ్ ఒబెరాయ్, సందీప్ సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్‌పై ‘దేశ భక్తే నా శక్తి’ అన్న క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.