ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయభేరీ మోగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. మొత్తం 25 లోక్సభ స్థానాలలో, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 17 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందన్నారు.
అలాగే, దేశ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి 400కుపైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు చెప్పారు.
తాము మూడోసారి అధికారం చేపట్టాక విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని చెప్పారు.
ఆర్టికల్-370 రద్దును చూపెడుతూ ఓట్లు అడగడం, యూసీసీని అమలు చేస్తామని చెప్పడం మత ఆధారిత ప్రచార కార్యకలాపాలే అయితే ఇకపైనా బీజేపీ అలాంటి ప్రచారమే చేస్తుందని తేల్చి చెప్పారు.
రాహుల్ గాంధీ వైఫల్యాన్ని కప్పి పుచ్చేందుకే పోలింగ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని విమర్శించారు.
జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం మోడీ ప్రభుత్వం సాధించిన విజయమని పేర్కొన్నారు.