ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం కారణంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ రోజు జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని మాట్లాడుతూ… పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు.
అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలతో పాటు భాష, రాజకీయ హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. వారి హక్కులను కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంరక్షిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడం వల్ల కాంగ్రెస్‌కు కడుపునొప్పి వచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.