telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మసూద్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టితీరుతాం… : అమెరికా

america on kashmir terrorist attack

అగ్రరాజ్యం అమెరికా జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి తీరుతామని మరోసారి స్పష్టం చేసింది. మసూద్‌ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆంక్షల కమిటీని అతిక్రమించి అమెరికా చర్యలు చేపడుతోందని చైనా ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను యూఎస్‌ తిప్పికొట్టింది. మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామని అమెరికా వెల్లడించింది. అంతర్జాతీయ సమాజంలో మసూద్‌ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు మేం, మా మిత్రదేశాలు, ఐరాస భద్రతామండలిలోని దేశాలు కలిసి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటామని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.

ఇందుకోసం యూకే, ఫ్రాన్స్‌ సహకారంతో సరికొత్త తీర్మానం రూపొందించామని, ఇటీవలే దాన్ని ఐరాస భద్రతామండలి సభ్య దేశాలకు పంపించినట్లు పేర్కన్నారు. ఈ తీర్మానంతో ఐరాసను తక్కువ చేస్తున్నామని చైనా వాదించడం సరికాదని అన్నారు. పుల్వామా దాడి తర్వాత మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ తీర్మానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని ఐరాస భద్రతామండలిలోని 15 సభ్య దేశాల్లో 14 ఆమోదించగా.. ఒక్క చైనా మాత్రం నిలిపివేసింది. దీనితో తాజాగా అమెరికా మరో తీర్మానాన్ని తీసుకొచ్చింది.

European union steps to confirm masud as terroristమసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేలా తీర్మానాన్ని తయారుచేసి సభ్య దేశాలకు పంపించింది. దీనిలో మసూద్‌పై ఆంక్షలు విధించాలని, ప్రయాణాలను నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని కోరింది. ఐసిస్‌, అల్‌ఖైదాతో జైషే నేతకు సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. ఆయా సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, ప్రణాళికలు రూపొందించడం, ఏర్పాట్లు చేయడం, మద్దతు తెలపడం వంటివి చేశారని తెలిపింది. ఈ కొత్త తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం అవసరం లేదు. అనుకూలంగా 9 ఓట్లు వస్తే చాలు. ఈ పరిణామాలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యతో ‘మసూద్‌’ సమస్య పరిష్కారం కాదు కదా.. మరింత క్లిష్టమవుతుందని ఆరోపించింది. ఇలా తీర్మానాన్ని బలవంతంగా ఆమోదించేలా చేయడం కాకుండా అమెరికా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని చైనా సుతిమెత్తగా హెచ్చరించడం విశేషం.

Related posts