తల్లిదండ్రుల ఆస్తిలో ఆడపిల్లలకు సమాన వాటా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ ఆడపిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని తెలిపింది.ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించడంపై దాఖలైన వేర్వేరు పిటిషన్‌లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.
1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణలు చేశారు. 2005 సెప్టెంబర్ 9న ఆ చట్టానికి భారత పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఉంటుందని ఆ చట్టంలో పేర్కొన్నారు. హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేపట్టే నాటికే కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు కూడా కొత్త చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
తండ్రికి ఆడపిల్ల ఉంటే చాలని, ఆస్తిలో వారికి సమానహక్కు ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. కుమార్తె జీవితాంతం తండ్రిని ప్రేమిస్తూనే ఉంటుందని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు.