telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాజధాని ఒక్కటే ఉండాలి.. ఉద్యమిస్తాం .. : రైతులు

amaravati farmers protest on 3 capitals

అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయవచ్చు అన్న వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ప్రజల్లో, మీడియాలో, దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంత ప్రజల్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాజకీయవర్గాల్లో కూడా సంచలనం రేపిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఆ ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారు రేపు రాజధాని ప్రాంతంలో నిరసన చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయంపై రాజధాని రైతులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. దీనిపై రేపు రాజధాని బంద్‍కు రైతులు పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలి అనే డిమాండ్ తో వారు నిరసన చేపట్టనున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేయనున్నారు.

తెలంగాణ ఉద్యమం తరహాలో రాజధాని ఉద్యమం జరగాలని వారు పిలుపునిచ్చారు. రేపటి నుంచి రోడ్ల దిగ్బంధనం, వంటావార్పు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. వెలగపూడిలో రిలే దీక్షలు చేయాలని రైతులు పిలుపునిచ్చారు. ఈ ప్రకటనపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఇప్పటికే తన నిరసన తెలిపింది. బీజేపీ పార్టీ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూనే కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. మరి.. రేపు రైతులు చేపడుతున్న దీక్షలకు రాజకీయ రంగు పులుముకుంటుందా.. రాజకీయ పార్టీలు మద్దతిస్తాయా.. లేక రైతులే స్వచ్చంధంగా నిరసన దీక్షలు చేపడతారా అనేది వేచి చూడాలి.

Related posts