ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు సోమవారం మహాపాదయాత్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేపట్టారు.
ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తమ పోరాట పంథాలో మరో అడుగువేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా 685 రోజులు… వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు, మహిళలు మహా పాదయాత్ర ద్వారా తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు తలపెట్టిన మహా పాదయాత్రను తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి ఈ ఉదయం 9గంటల 5 నిమిషాలకు ప్రారంభించారు.
ఈ పాదయాత్రకు టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఆప్ సహా రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేతలు దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధాని కొనసాగేవరకు తమ మద్దతు సాగుతుందని నేతలు తెలిపారు.
ప్రారంభానికి ముందు తుళ్లూరులో వందలాది మంది రైతులు తరలివచ్చారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో కాలభైరవ, లక్ష్మీ గణపతి ఆలయాల్లో పూజలు చేశారు. ఈ పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగనుంది. ఈ పోరాటం తమకోసం కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగితూ తిరుపతికి చేరుకుంటుంది.”మేము రోజుకు 14-15 కిలోమీటర్లు వివిధ మార్గాల్లో నడవాలని ప్లాన్ చేసామని రైతులు అన్నారు.
మహాపాదయాత్రకు పోలీసులు ఆంక్షలతో అనుమతించారు. ఈ పాదయాత్రను ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే నిర్వహించాలని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ప్రసంగాలు, స్వాగతాలను నిషేధించారు. 157 మందికి ఒక్కరు కూడా మించకుండా పాదయాత్ర చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాదయాత్రలో పాల్గొన్న వారు కచ్చితంగా ఐడి కార్డులు ధరించాలని సూచించారు.
ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కొత్త డ్రామా: లోకేశ్ ఫైర్