telugu navyamedia
రాజకీయ

సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మకు ఉద్వాసన

SC Judgment On CBI Alok Verma |
సీబీఐ చీఫ్‌గా అలోక్‌వర్మకు ఉద్వాసన పలుకుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనను తిరిగి విధులలో కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజులకే మరోసారి వేటువేసింది. దీంతో మరో 21రోజుల పదవీ కాలం ఉండగానే అయనపై కమిటీ వేటు వేసింది. గురువారం రాత్రి ప్రధాని నివాసంలో భేటి అయిన కమిటీ అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్దారించింది.
ఆయనను అగ్నిమాపక సేవల విభాగానికి డీజీగా బదిలీచేసింది. సీబీఐ డైరెక్టర్ బాధ్యతలను అదనపు డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావుకు మరోసారి అప్పగించింది.  సీబీఐ హైలెవల్‌ కమిటీ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు బదులుగా జస్టిస్ ఏ కే సిక్రి పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలోక్‌ వర్మ బుధవారమే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు సీబీఐ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అలోక్‌ వర్మ వరుస సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీబీఐ డైరెక్టర్‌(ఇన్‌చార్జ్‌)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేశారు. అంతేకాకుండా జేడీ అజయ్ భట్నాగర్ సహా మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. 
రఫేల్‌ అవినీతి బయటపడుతుందనే: రాహుల్‌ రఫేల్‌ కుంభకోణం కేసును ఆలోక్‌ వర్మతో దర్యాప్తు చేయిస్తే ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో ఆరోపించారు.
‘సీబీఐ చీఫ్‌ వర్మను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని ఎందుకు తొందర పడ్డారు?, ఎంపిక కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించకుండా వర్మను మోదీని ఎందుకు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ‘రఫేల్‌’ అని రాహుల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Related posts