దళపతి విజయ్ హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న తమిళ సినిమా ‘మాస్టర్’. ‘ఖైదీ’ సినిమాతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా కాగా ఆండ్రియా, శాంతను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విజయ్ సినిమాలకు వివాదాలు చాలా కామన్ అయిపోయాయి. గతంలో దళపతి పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వచ్చిన సమయంలో, తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా విజయ్ సినిమాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
తాజాగా మాస్టర్ సినిమా విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. మాస్టర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ఈ ఆరోపణలు మొదలయ్యాయి. ఈ సినిమా ఓ కొరియన్ సినిమాకు ఫ్రీమేక్ (హక్కులు తీసుకోకుండా రీమేక్ చేయటం) అన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా విజయ్ చిత్రాలకు రిలీజ్ సమయంలో వివాదాలు వస్తుంటాయి. కానీ మాస్టర్ విషయంలో ఫస్ట్ లుక్‌తోనే మొదలు కావటంతో అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది.
ఈ సినిమా సెకండ్ లుక్ విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. మాస్టర్ సెకండ్ పోస్టర్, నాని హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్‌మెన్ సినిమా పోస్టర్‌ను పోలి ఉండటంపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఈ సినిమా థర్డ్ పోస్టర్‌పై కూడా కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా విజయ్, విజయ్ సేతుపతిలు ఉన్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన రాజుగారి గది 3 సినిమా పోస్టర్‌ను పోలి ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.