telugu navyamedia
సినిమా వార్తలు

మరో తెలుగు సినిమాకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్

Keerthy-Suresh

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “మహానటి”. ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ కనబరిచిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాదు కీర్తి సురేష్ క్రేజ్ ఈ సినిమా తరువాత అమాంతంగా పెరిగిపోయింది. దీంతో కీర్తి సురేష్ కు ఆఫర్లు వెల్లువలా వస్తున్నప్పటికీ తన పాత్రకు మంచి ప్రాధాన్యమున్న కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తమిళంలో వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగులో మాత్రం “మహానటి” తరువాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడొక కథ నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాతో నరేంద్రనాథ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. నాయికా ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్, నదియా, కమల్ కామరాజు, భానుశ్రీ మెహ్రాలు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను తాజాగా వదిలారు చిత్రబృందం. మిగతా నటీనటుల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇక కీర్తి సురేష్ ఫుట్ బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో కథానాయికగా నటించనుంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో కనిపించనుండగా అతని భార్యగా కీర్తి నటించనుంది. కథ ప్రకారం సినిమాలో కీర్తి సురేష్ 30 ఏళ్ల స్త్రీ పాత్రలో కనిపిస్తుందట. ఇందుకోసం టీమ్ ఆమెకు ప్రత్యేకమైన మేకప్ వేయనున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ శర్మ సంగీతం అందిస్తున్నారు.

Related posts