telugu navyamedia
సినిమా వార్తలు

అక్కినేని మనసులో వున్న .. ఆ కోరిక

ఈరోజు మహానటుడు ,పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వర రావు 98వ జయంతి …
ఏడు దశాబ్దాల పాటు నటుడుగా కొనసాగిన అక్కినేని నాగేశ్వర రావు ధరించని పాత్ర లేదు , చేయించుకోని సన్మానం లేదు . అందుకొని అవార్డులు లేవు . నటుడుగా , వ్యక్తిగా నాగేశ్వర రావుది సంపూర్ణమైన జీవితం.
జర్నలిస్టుగా అక్కినేనితో నాకు నాలుగు దశాబ్దాల అనుబంధం వుంది . ఆయన సినిమా జీవితంలో నెరవేరని ఓ కోరిక వుంది . అదేమిటో మీకు తెలియజేస్తాను .

1980లో నాగేశ్వర రావు “ఏడంతస్తుల మేడ “, “నాయకుడు – వినాయకుడు “, “బుచ్చి బాబు”,, “పిల్ల జమిందార్ ” చిత్రాల్లో నటించారు . సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో “పిల్ల జమిందార్ ” చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది . ఈ సినిమా ఊహించని పరాజయం పాలైంది . ఇలాంటి స్థితి నాగేశ్వర రావు ఊహించలేదు . సినిమాకు వచ్చిన ఆర్ధిక నష్టం అలావుంచితే , అక్కినేని ఇలాంటి సినిమా నిర్మించారేమిటి ? అన్న విమర్శలు బాగా వచ్చాయి .

“పిల్ల జమిందార్ ” ప్రభావం ఆయనపై బాగా పడింది . ఇక ముందు ఇలాంటి పొరపాటు చెయ్యకూడదు అనుకున్నారు . మళ్ళీ సినిమా చెయ్యడానికి కొంత సమయం తీసుకున్నారు . ప్రతి రోజు అన్నపూర్ణ స్టూడియోస్ కు రావడం ,తన కాటేజ్ లో ఎక్కువ సమయం గడిపేవాడు . నిర్మాతలు , దర్శకులను కూడా కలవడానికి ఇష్టపడేవారు కాదు .

Remembering Telugu cinema's yesteryear popular actor Akkineni Nageswara Rao  on his 6th death anniversary | The Times of India

ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వార పత్రికకు హైదరాబాద్ లో నేను రిపోర్టర్ గా ఉండేవాడిని ఒకరోజు షూటింగ్ కవరేజ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాను . కాటేజ్ దగ్గర నాగేశ్వర రావు గారి కారు చూసి ఆయన్ని కలుద్దామని వెళ్ళాను . అప్పటికి ఆయన్ని కలసి ఒక నెల రోజులవుతుంది . నేను నాగేశ్వర రావు గారిని కలవాలంటే అనుమతి అవసరం లేదు . అందుకే సరాసరి ఆయన గదిలోకి వెళ్ళాను . ఆయన కూర్చోవడానికి ఎల్ ఆకారంలో ఓ పెద్ద టేబుల్ ఉండేది . ఎవరైనా అతిధులు వస్తే కూర్చోవడానికి నాలుగు కుర్చీలు ఉండేవి .నేను లోపలకు వెళ్ళగానే తలెత్తి చూశారు . కూర్చోమని కుర్చి చూపించారు .
“నమస్కారం సార్ ” అన్నాను .

Akkineni Nageswara Rao: Nata Samrat of Telugu cinema, for whom every film  was like a PhD

“నమస్కారం , ఏమిటి ఇలా వచ్చారు , నేను ఇప్పుడు ప్రెస్ వారితో మాట్లాడటం లేదుగా , అంటే కొత్త వార్తలు లేవుగా ?” అన్నారు .
“వార్తలు ఉంటేనా మీ దగ్గరకు వస్తానా ?” అన్నాను .
అది కాదు ,స్టూడియోస్ లో వేరే షూటింగ్ లు జరుగుతున్నాయి కదా , అటు వెళ్లకుండా వచ్చారని.. ”
” మీరు వున్నారని తెలిసి వచ్చాను . మిమ్మల్ని కలసి చాలా రోజులైంది , అందుకే వచ్చాను ” చెప్పాను .
“కాఫీ తాగుతారా ” అన్నారు .
“వద్దు” అని “ఆ ఫోటో ఏమిటి ?” అని అడిగాను .
“అదా , వద్దు లెండి , మీరు చూస్తే పబ్లిష్ చేస్తానంటారు ” అన్నారు
“మీరు వద్దంటే ఎలా చేస్తాను , నా మీద నమ్మకం లేదా ” అన్నాను .
“నో నో … నమ్మకం లేక కాదు .. ” అని ఆ ఫోటో నాకు చూపించారు .
ఆ ఫోటో వైపు అలా తదేకంగా చూస్తున్నాను .
ఆ ఫోటో చూస్తుంటే మీకెవరూ గుర్తుకు రావడం లేదా ? ” ఆసక్తిగా అడిగారు .
“ఇలా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు . ఎక్కడో ఇలాంటి వ్యక్తిని చూసినట్టు వుంది . కానీ … ” అన్నాను
“వారు రామకృష్ణ పరమ హంస .. ఈ ఖాళీ సమయంలో ఆయన్ని గురించి ఎక్కువగా చదివాను , ఆయన వ్యక్తిత్వము చాలా స్ఫూర్తిని కలిగించింది . ఆ మహనీయుని పాత్రలో నటించాలని అనిపించింది . అందుకే అసలు నేను ఆ పాత్రకు సరిపోతానా ? లేదా ? అనిపించి నిన్ననే ఫోటోగ్రాఫర్ ని పిలిపించి కొన్ని ఫోటోలు తీయించాను . అందులో ఈ ఫోటో నాకు బాగా వచ్చింది ” అని చెప్పారు .

“నిజమే ఆ పాత్రకు మీరు పర్ఫెక్ట్ గా సరిపోతారు ” అని చెప్పాను .
అయితే ఆ తరువాత నాగేశ్వర రావు గారు నటించిన “శ్రీవారి ముచ్చట్లు “, “ప్రేమాభిషేకం ” చిత్రాలు ఘనవిజయం సాధించాయి . ఈ రెండింటికీ దర్శకుడు దాసరి నారాయణ రావు. అక్కడ నుంచి నాగేశ్వర రావు వెనక్కు తిరిగి ఆలోచించే తీరిక లభించలేదు.
ఆ తరువాత కాలంలో నాగేశ్వర రావు రామకృష్ణ పరమ హంస సినిమా మాత్రం చేయలేకపోయారు .
ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఫోటో ఇదే !


– భగీరథ ..

Related posts