మాస్కో నుంచి సింఫెరోపోల్‌కు వెళ్తున్న ఎయిర్‌బస్ 320 విమానంలో గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో గాల్లోకి ఎగిరిన అరగంటకే పైలట్లు విమానాన్ని తిరిగి మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. మే 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసెంజర్ ఉన్నట్టుండి ఓ యువతి గొంతునులిమి ఆమెపై హత్యాయత్నం చేయబోయాడు. ఆమెను కాపాడటానికి మిగతా వారు ముందుకు వస్తుండగా.. “బతకాలనుంటే ఎవరి సీట్లలో వారు కూర్చోండి. పైలట్లు నిద్రపోతున్నారు. మనమందరం చావబోతున్నాం” అంటూ వింతగా అరవడం మొదలుపెట్టాడు. విమాన సిబ్బంది ఆ వ్యక్తిని బలవంతంగా లాగి తన సీటుకు కట్టేశారు. ఇదే సమయంలో ఆ వ్యక్తికి గుండెనొప్పి రావడంతో అక్కడున్న వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. విమానంలో ఉన్న ఓ డాక్టర్ అతనికి గుండెనొప్పి వచ్చిందని గుర్తించి పైలట్‌కు సమాచారమిచ్చారు. పైలట్ వెంటనే అధికారులకు సమాచారాన్ని అందించి విమానాన్ని వెంటనే మాస్కో ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. డాక్టర్లు వ్యక్తిని పరీక్షించగా కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్టు తెలిపారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, కేవలం గుండె నొప్పి కారణంగానే మరణించినట్టు పోలీసులకు విమానంలో ప్రయాణించిన ప్యాసెంజర్లు తెలిపారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
previous post