telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శశికళకు దిమ్మదిరిగే షాకిచ్చిన తమిళనాడు సర్కార్‌ !

తమిళనాడు రాజకీయాలు అన్ని రాష్ట్రాల కంటే విభిన్నంగా ఉంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఆ రాష్ట్రంలో లోకల్‌ పార్టీలదే హవా. జాతీయ పార్టీలను అంతగా అక్కడి ప్రజలు ఆదిరంచరు. అయితే.. శశికళ ఎపిసోడ్‌తో తాజాగా తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శశికళ ఫిబ్రవరి 7న చెన్నై చేరుకోనున్నారు. చెన్నై రాగానే మెరీనా బీచ్లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లాలని శశికళ నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన తర్వాత కూడా జయలలిత సమాధి వద్దకు వెళ్లిన శశికళ శపథం కూడా చేసింది. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పుడు కూడా జయ సమాధి వద్దకు వెళ్లాలనుకుంటున్నారు శశికళ. అదే జరిగితే జయ సమాధి ఉన్న ప్రదేశం..కావటంతో, కార్యకర్తల గుంపు మధ్య భావోద్వేగానికి లోనై, రాజకీయ ప్రణాళికను అక్కడి నుంచే ప్రకటించే అవకాశం ఉందని భావించారు. ఇదే జరిగితే, జయ అభిమానుల్లో శశికళపై కొంత సానుభూతి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీన్నిఊహించిన అన్నాడీఎంకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా చిన్నమ్మ ఎత్తుకు పైఎత్తు వేసింది. జయలలిత సమాధికి తుది మెరుగులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నందున 15 రోజుల పాటు ఎవరికీ సందర్శనకు అనుమతి లేదని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. జయలలిత సమాధి సందర్శనపై ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించడంతో అక్కడికి వెళ్లాలనుకున్న శశికళకు నిరాశే ఎదురు కానుంది.

Related posts