telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వచ్చే ఏడాది ఐపీఎల్ లో కొత్త టీం కోసం ఆక్షన్…

list of players ready for ipl 2020

ఏన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్‌ ఓవర్లు, పోటాపోటీ సమరాలు, రన్‌రేట్‌ల దాగుడుమూతల మధ్య యూఏఈ వేదికగా గత మంగళవారం ఐపీఎల్‌ 2020 ముగిసింది. అయితే ఈసారి అయినా కొత్త విజేత వస్తుందనుకుంటే.. అలా జరగలేదు. రోహిత్‌ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మళ్లీ టైటిల్‌ గెలుచుకొని ఐదోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. యూఏఈలో ఐపీఎల్ 2020 ముగిసిందో లేదో క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త అందింది. ఐపీఎల్ 2021లో మరో కొత్త జట్టు రానుందని సమాచారం. 9వ జట్టుగా గుజరాత్ ఆడనుందని తెలుస్తోంది. అహ్మదాబాద్‌ బేస్డ్‌గా ఏర్పాటయ్యే కొత్త ఫ్రాంచైజీని కొనుగోలుచేయడానికి ఓ కార్పొరేట్ దిగ్గజం సిద్ధంగా కూడా ఉందని సమాచారం. మరి కొత్త జట్టు వస్తే.. టోర్నీ సమయం, మ్యాచుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. గుజరాత్ క్రికెట్ సంఘం అహ్మదాబాద్‌లో 1.10 లక్షల సిట్టింగ్ కెపాసిటీతో మొతేరా స్టేడియాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ మైదానాన్ని మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత సంవత్సరం ఆరంభించారు.

కొత్త జట్టు ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నందున పూర్తి స్థాయిలో మెగా వేలానికి బీసీసీఐ సన్నద్ధం అవుతోందట. వచ్చే ఏడాది ఆరంభంలో పూర్తి స్థాయిలో వేలం జరగనుందని ఫ్రాంచైజీలకు బోర్డు సంకేతాలిచ్చిందని సమాచారం. స్టార్ ఆటగాళ్లు కూడా వేలంలోకి రానున్నారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 యూఏఈలో జరగ్గా.. వచ్చే సీజన్‌ను భారత్‌లోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఇదివరకే ఓ ప్రకటనలో చెప్పారు. బెట్టింగ్ ఆరోపణల కారణంగా 2016, 2017 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై నిషేధం పడిన విషయం తెలిసిందే. ఆ రెండు సంవత్సరాలు గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలు ఐపీఎల్ ఆడాయి. సురేశ్ రైనా నాయకత్వంలోని గుజరాత్ లయన్స్ బరిలోకి దిగగా.. ఎంఎస్ ధోనీ సారథ్యంలో రైజింగ్ పుణే ఆడింది. రెండు సంవత్సరాలు ఆడినా.. గుజరాత్, పుణే కప్ కొట్టలేదు.

Related posts