జిల్లాలోని సారవకోట మండలంలోని కుమ్మరిగుంటకు చెందిన రమణ (41) వరి చేనులోని కలుపు తీస్తున్నాడు. పనిసమయంలో వర్షంతో పాటు పిడుగుపడటంతో రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప పొలాల్లో పనిచేస్తున్న కూలీలు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న తహశీల్దార్ బి.రామ్మోహనరావు, ఎస్‌ఐ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య అప్పలమ్మ, కుమారుడు షణ్ముఖరావు, కుమార్తె మనీషా ఉన్నారు. కుమారుడు డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతుండగా, కుమార్తెకు వివాహమైంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.