ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అత్యంత శక్తిమంతమైన అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో నుంచి బుధవారం రాత్రి ఏడు గంటల 50 నిమిషాలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ ప్రయోగాన్ని జరిపింది.
ఇదిలా ఉండగా..అగ్ని సిరీస్ ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 17 మీటర్ల పొడవుండే కొత్త అగ్ని-5 క్షిపణి 1.5 టన్నుల వార్హెడ్లను మోసుకువెళ్లగలదు. ఇది 5,000 కిలోమీటర్లకుపైగా ఉన్న లక్ష్యాలను విజయవంతంగా చేధించినట్లు సమాచారం.
అయితే, దీనికి సంబంధించి సంబంధిత వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అగ్ని-5 పరీక్ష 2020లోనే జరుగాల్సి ఉండగా.. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడింది. ఇంతకు ముందు డీఆర్డీఓ జూన్లో అగ్ని ప్రైమ్ క్షిపణిని పరీక్షించింది.