మరోసారి శబరిమలలో మహిళల హడావుడి చోటుచేసుకుంది. దీనికి కారణం, మరో ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వచ్చిన వేళ, మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పంబను దాటి ట్రెక్కింగ్ మొదలు పెట్టిన వీరిని, నీలిమల వద్ద భక్తులు అడ్డుకున్నారు. మహిళలను రానిచ్చేది లేదని తేల్చి చెబుతూ, శరణు ఘోష చెబుతూ నిరసన వ్యక్తం చేశారు.
దీనితో పోలీసులు, ఈ ఇద్దరు మహిళలను వెంటనే కిందకు తీసుకెళ్లి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆలయాన్ని ఏ వయసు మహిళైనా దర్శించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత, గత నెలలో ఇద్దరు మహిళలు స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ సుమారు 10 మంది మహిళలు స్వామిని దర్శించారని కేరళ ప్రభుత్వం చెబుతుండగా, ఇద్దరు మాత్రమే దర్శించుకున్నారని, ఆపై ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించామని ఆలయ వర్గాలు అంటున్నాయి.