చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారని.. ఎవరో చెప్పినట్టుగా, ముందు పొత్తుపెట్టుకుంటే కనీసం గెలుపుదాకా వెళ్ళేవాళ్ళం.. తెరవెనుక పొత్తుతో ఉన్నది ఊడింది అనుకుంటున్నారట.. ఎవరోకాదు, బాబు-పవన్. ఇప్పటికైనా ఇద్దరు కలిసి ఏపీలో ప్రభుత్వంపై పోరాటాలు చేస్తారట. కొత్త ప్రభుత్వం, పాత శత్రువు… అందుకే మళ్ళీ కలసిపోవాలనుకుంటున్నట్లుగా వార్తలు షికార్లు కొడుతున్నాయి. చంద్రబాబుతో టీడీపీ కాపు నాయకులు భేటీ సందర్భంగా పవన్ని చేరదీయాలని చెప్పినట్లుగా వార్త బయటకు వచ్చింది. పవన్ తో పొత్తు పెట్టుకుని ఉంటే టీడీపీ గెలిచేదని కూడా బాబుకు పసుపు పార్టీ కాపులు చెప్పారట. బాబు కూడా రాజకీయ సమీకరణలు అన్నీ చూసుకుని అవుననే అన్నారట.
ఇప్పటికిపుడు కాకపోయినా లోకల్ బాడీ ఎన్నికల నాటికి రెండు పార్టీ కలసి జగన్ మీదకు ఉమ్మడిగా యుధ్ధానికి సిద్ధం అవనున్నాయి. పవన్ కూడా ఇపుడు టీడీపీ పద్ధతిలోనే విమర్శలు చేస్తున్నారు. రైతులకు విత్తనాలు అందడం లేదని టీడీపీ అంటే పవన్ ఏకంగా జగన్ సర్కార్ కి లేఖ రాశారు. అంటే ఇద్దరి ఆలోచనలూ ఒక్కటిగా ఉన్నాయి. ఇక జగన్ గెలుపుపై ఇప్పటికీ టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూంటే పవన్ సైతం ఎలా ఓడిపోయామని అనుమానంతో ఉన్నారు. ఇద్దరూ పాత మిత్రులే కాబట్టి శత్రువు ఉమ్మడి వాడు కాబట్టి కలసిపోయినా ఆశ్చర్యం లేదు. అది తొందరలోనే జరుగుతుందని కూడా అంటున్నారు. ప్రాంతీయ ఎన్నికలు కదా, అందుకే తప్పదు!!