telugu navyamedia
రాజకీయ

మంత్రిని డెలివరీ బాయ్‌గా మార్చిన ఆప్ఘన్ పరిస్థితులు

ఆప్ఘనిస్తాన్‌లో పరిస్థితులు తలకిందులైపోయాయి. నిన్నటి వరకు ధనవంతులుగా ఉన్నవారు బికారులుగా మారిపోయారు. తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించడంతో ఆస్తులు వదులుకుని విదేశాలకు పారిపోయారు. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో తలదాచుకుంటున్న ఆప్ఘన్లు కుటుంబ పోషణ కోసం కూలిపని చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా ఆప్ఘన్‌ మాజీమంత్రి పిజ్జా డెలివరీ బాయ్ అవతారమెత్తారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఆయన ఇప్పుడు సైకిల్‌పై ఇంటింటికి వెళ్లి పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు.

ఆప్ఘనిస్తాన్‌లో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన సయ్యద్ అహ్మద్ షా సాదత్ ఇప్పుడు విదేశాల్లో పిజ్జా డెలివరీలు చేస్తున్నారు. గతేడాది ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో విభేదాలు వచ్చి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం కొంతకాలం జీవితం ప్రశాంతంగా గడిచినా తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చయిపోవడంతో ఇప్పుడు డెలివరీ బాయ్‌గా మారాల్సి వచ్చిందని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు. తాను ఈ పని చేస్తున్నందుకు సిగ్గుపడటం లేదని అన్నారు. కుటుంబ పోషణ కోసం ఈ పని చేస్తున్నట్లు తెలిపారు. ఆప్ఘనిస్తాన్‌లో ఉన్నప్పుడు ఐటీ మంత్రిగా మొబైల్ నెట్ వర్కింగ్‌ అభివృద్ధి చేశారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమిస్తారని ముందే గ్రహించి వారం రోజుల ముందుగా జర్మన్‌కు వెళ్లిపోయారు.

Related posts