telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్… బాలీవుడ్ గురించి నిజాలను బయటపెట్టిన హీరోయిన్

Elli

బాలీవుడ్ నటి, మోడల్, “బిగ్‌బాస్-7” మాజీ పోటీదారు ఎల్లీ అవ్రామ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2013లో “మిక్కీ వైరస్” సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఎల్లీ అవ్రామ్ ఆ తర్వాత వరుసపెట్టి సినిమా అవకాశాలు దక్కించుకుంది. “నామ్ షబానా”, “పోస్టర్ బాయ్స్”, “బజార్” తదితర సినిమాల్లో నటించింది. తమిళంలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న “పారిస్ పారిస్” సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టింది. “కిస్ కిస్కో ప్యార్ కరూ” సినిమాతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఎల్లీకి ఆ తర్వాత ఇండస్ట్రీ నిజస్వరూపం ఏంటో అర్థమైందట. ఇద్దరు దర్శకులు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని ఓ ఫిల్మ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. కెరియర్ తొలినాళ్లలో అవకాశాల కోసం ఇద్దరు దర్శకులను కలిస్తే వారిద్దరూ తనకు షేక్‌హ్యాండ్ ఇస్తూ చెయ్యి గోకి అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది. వారు అలా ఎందుకు ప్రవర్తించారో, దానికి అర్థమేంటో కూడా తనకు తెలియదని ఎల్లీ చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన స్నేహితురాలికి చెబితే ఆమె షాకై దానికి అర్థం చెప్పిందని, దీంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని వివరించింది. ఇండస్ట్రీలో తాను సెక్సిజం ఎదుర్కొన్నానని పేర్కొన్న ఎల్లీ… ఆడిషన్స్ సమయంలో తనను రకరకాల మాటలన్నారని గుర్తు చేసుకుంది. ఒకరు తనను పొట్టిగా ఉన్నావని అంటే, ఇంకొకరు నుదురు బాగాలేదని, మరొకరు పళ్లు బాగాలేవని అన్నారని పేర్కొంది. తన పొడవాటి జుట్టు చూసి ఆంటీ అని పిలిచినవారూ ఉన్నారని తెలిపింది. తాను నటిని కాలేనని ఇండస్ట్రీకి చెందిన ఓ అమ్మాయి తన ముఖం మీదే చెప్పేసిందని ఎల్లీ పేర్కొంది. ఓసారి ఓ పెద్ద సినిమాలో అవకాశం వస్తే.. హీరోకి తాను నచ్చలేదని, తన స్థానంలో మరో నటిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నో ఆశలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తాను ఇంకెన్నో సమస్యలను ఎదుర్కొన్నానని వాపోయింది.

Related posts