నటుడు శ్రీకాంత్ కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన పలు చిత్రాల్లో కీలకపాత్రలను పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఓ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కునున్న చిత్రంలో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారట. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు బాలకృష్ణ-బోయపాటి శ్రీను జోడీ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం ఇటీవల ప్రారంభమైంది.
త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట. దీంతో ఈ పాత్ర కోసం చిత్రబృందం శ్రీకాంత్‌ను తీసుకోవాలని భావిస్తుందట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే శ్రీకాంత్.. ‘యుద్ధం శరణం’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు.