మా ఎన్నికల వేడి రగులుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఎన్నికల రోజు తనను మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారని నటుడు బెనర్జీ ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ఆధ్వర్యంలో అందరూ మీడియాతో మాట్లాడుతున్నారు.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, అలాంటిది అందరి ముందు మోహన్ బాబు బూతులు తిడుతూ అవమానించారని చెబుతూ బెనర్జీ ఎమోషనల్ అయ్యారు.
‘ఎలక్షన్స్‌లో గెలిచానని అందరూ కంగ్రాట్స్ చెప్పినా అది నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే పోలింగ్ రోజు ఉదయమే వందల మందిలో మోహన్ బాబు నన్ను పచ్చి బూతులు తిట్టారు.తనీష్‌ను తిడుతుంటే ఆపినందుకు నన్ను మోహన్‌బాబు కొట్టబోయారు.
పోలింగ్ జరిగే చోట మోహన్‌బాబు అలా ప్రవర్తిస్తున్నా ఎవరూ ఆపలేదు. తనీష్, నాకు చాలా బాధకలిగి కంటతడి పెట్టుకున్నామ. మూడు రోజుల నుంచి చాలా బాధపడుతున్నా. మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు నన్ను బలవంతంగా ఆపారు. మోహన్‌బాబు సతీమణి కూడా ఫోన్ చేసి నన్ను ఓదార్చారు.
పోలింగ్ రోజు జరిగిన పరిణామాలను నుంచి ఇంకా తేరుకోలేదు చాలా చాలా బాధ కలిగింది. ఇలా ఎందుకు బతకాలి మనం?ఇలాంటి అసోసియేషన్‌లో ఎందుకు ఉండాలి’ అంటూ బెనర్జీ కంటతడి పెట్టారు. మంచు లక్ష్మిని, విష్ణుని ఎత్తుకుని తిరిగాను ఎందుకు అలా చేశారో అర్ధం కాలేదు. దారుణంగా మాట్లాడారు. నేను ఎప్పుడూ ఇటువంటి మాటలు పడలేదు అంటూ చెప్పారు.