telugu navyamedia
క్రైమ్ వార్తలు

సిద్ధూ మూసేవాలా హంతకులు ఎన్‌కౌంట‌ర్‌లో హతం..

పంజాబీ సింగ‌ర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హంతకులను పోలీసులు మట్టుబెట్టారు. మృతులను జగ్రూప్ సింగ్ రూపా మన్‌ప్రీత్ సింగ్ గా గుర్తించారు. అమృత్‌సర్‌ సమీపంలోని భక్నా గ్రామంలో నాలుగు గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జ‌గ్రూప్ రూపా, మ‌న్నూ కోసాలు అమృత్‌స‌ర్ జిల్లాలోని భాక్నా క‌ల‌నౌర్‌లో ఉన్నట్లు తేలింది. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

ఈ క్రమంలో పోలీసులకు, గ్యాంగ్‌స్ట‌ర్ల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. యాంటీ గ్యాంగ్‌స్ట‌ర్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ ఎన్‌కౌంట‌ర్‌లో పాల్గొన్నారు.

పంజాబీ సింగ‌ర్ సిద్ధూ మూస్‌వాలా హ‌త్యకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితులు ఎన్‌కౌంట‌ర్లో హతం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వార్త కవరేజికి వెళ్లిన వీడియో జర్నలిస్ట్ ఒకరు గాయపడ్డారు. అతడి కుడికాలికి గాయాలయ్యాయి.

ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసులు భక్నా గ్రామంలో అనేక ఇళ్లను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనా స్థలం నుంచి ఏకే47, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇప్పటివరకూ మొత్తం 8 మంది షూటర్లను అరెస్ట్ చేశారు. దీపక్ మండి అనే షూటర్ ఇంకా పరారీలో ఉన్నాడు.

పంజాబ్‌లోని జవహర్కే అనే గ్రామంలో ఈ ఏడాది మే 29న సిద్ధూ మూసేవాలాను దుండగులు కాల్చి చంపారు. రెండు స్కార్పియోలు, ఒక బులేరోలో దాదాపు పది మంది దుండగులు సిద్ధూ మూసేవాలా కారును వెంబడించారు. ఓ కారు వీరిని ఓవర్‌టేక్‌ చేసి.. ముందుకు వెళ్లి నిలిచింది.

మూసేవాలా తన వాహనాన్ని నిలిపిన వెంటనే మూడు ఎస్‌యూవీల్లోంచి పిస్టళ్లు, ఏకే-47తో దిగిన దుండగులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సిద్ధూ మూసేవాలాను పొట్టనపెట్టుకున్నారు. పంజాబ్‌లో 424 మందికి భద్రత ఉపసంహరించిన మర్నాడే ఈ హత్య జరిగింది. ఉలిక్కిపడిన మాన్ ప్రభుత్వం మళ్లీ తిరిగి అందరికీ భద్రతను పునరుద్ధరించింది.

Related posts