హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన పెద్దమ్మ గుడి ఈవో అంజనారెడ్డి ఏసీబీ వలలో చిక్కారు. ఓ పూజారిని విధుల్లోకి తీసుకునేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి ఏసీబీకి దొరికిపోయారు. ఆంజనేయ శర్మ అనే అర్చకుడి ప్రవర్తన బాగాలేకపోవడంతో రెండేళ్ల క్రితం అప్పటి ఈవో బాలాజీ ఆయనను విధుల నుంచి తప్పించారు. ఇటీవల బాలాజీ బదిలీ పై వెళ్ళగా ఆయన స్థానంలో అంజనారెడ్డి వచ్చారు. తనను విధుల్లోకి తీసుకోవాలని ఆయనను ఆంజనేయశర్మ బతిమిలాడారు.
అయితే, విధుల్లోకి తీసుకోవాలంటే ఆరు నెలల వేతనంతో పాటు రూ.4లక్షలు ఇవ్వాలని ఈవో డిమాండ్ చేశారు. మంగళవారం ముందస్తుగా రూ.లక్ష ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ విషయంపై ఆంజనేయశర్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ బృందం వల ఫన్నీ ఈవో అంజనారెడ్డిని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా పెద్దమ్మ గుడి చరిత్రలో సోదాలు జరగడం ఇదే ప్రథమం.