telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఉగాది రోజున చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసా…!

హిందూ పంచాగం ప్రకారం ఛైత్ర మాసం నుండి ఉగాది పండుగ ప్రారంభమవుతంది. ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభ కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన అంటే మంగళవారం ఈ పండుగ వచ్చింది.

🍁 ఈ కాలంలో చెట్లు బాగా చిగురిస్తాయి. పూతలు కూడా బాగా వస్తాయి. ఇదే సమయంలో మనుషుల శరీరంలోనూ కొన్ని మార్పులు వస్తాయి. వసంత ఋతువు ప్రారంభమవ్వగానే మనకి నవ చైతన్యం వస్తుంది.

🍁 ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్రపు నడక అని.. నక్షత్రాల నడక ప్రారంభం అంటే.. ఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క ‘ఆది’ ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

🍁 ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. మరి కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఇంతకీ తెలుగు వారి కొత్త ఏడాదిలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం…

🍁 ముందుగా ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు..

🍁 ఉగాది పండుగ ఈరోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. మన శరీరానికి, తలకు నువ్వులనూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని తైలాభ్యంగ స్నానం చేయాలి. అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి.

 🍁 సాధారణంగా మన దేశంలో ఏదైనా పోటీలో విజయం సాధించినప్పుడు జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అదే విధంగా బ్రహ్మకు సంబంధించి, ఇంద్రుడికి సంబంధించినది ధ్వజారోహణం. ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలట. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు కానీ.. మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణం చేస్తారు.

🍁 ఉగాది పండుగ రోజున కచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి. అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త గొడుగు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల మీకు ఎండ, గాలి, వర్షం నుండి రక్షణ లభిస్తుంది. పేదలకు దానం..

🍁 వేసవికాలంలో ఒకప్పుడు విసనకర్రల అవసరం బాగా ఉండేది. వాటిని వెదురు బొంగులతో, తాటాకులతో చేసేవారు. వాటితో విసురుకోవడం వల్ల సమ్మగా ఉండేది. మన బాడీ హాయిగా ఉండేది. అయితే ఇప్పుడంతా ఫ్యాన్లనే వాడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు పేదలకు ఛత్రచామరాలను దానం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది.

🍁 ఉగాది రోజున దమనేన పూజ చేయాలి. దమనం అంటే ఒక పత్రి. సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలంలో ఇవి విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది పండుగ రోజు నుండి పౌర్ణమి వరకూ ఒక దేవతా మూర్తిని ఎంతో నియమ నిష్టలతో పూజలు చేయాలి.

🍁 చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు.. విదియ రోజున శివునికి, తదియ రోజున గౌరీ శంకరులకు, చతుర్థి రోజున వినాయకుడికి, ఇలా పౌర్ణమి వరకు దేవుళ్లకు పూజలు చేయాలి. కొన్ని గ్రంథాలలో హిందూ పురాణాల ప్రకారం, వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయాల్సిన సమయం ఉగాది పండుగ నాడే అని చెప్పబడింది. మహాశాంతి చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి.

🍁 మహాశాంతి చేయాల్సిన పనుల్లో ఉగాది కూడా ఒకటి. పూర్వకాలంలో ఈ పవిత్రమైన రోజున సంవత్సరేష్టి అనే యజ్ణం చేసేవారని కనిపిస్తుంది. ఉగాది రోజున వినాయకుడిని, నవగ్రహాలను, బ్రహ్మదేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడి.. ఉగాది పండుగ రోజున కచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలా మందికి తెలియదు.

🍁 ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు.

🍁 ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఫ్లవ నామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాం.

🍁 చేయకూడని పనులు.. ఉగాది పండుగ రోజున ఆలస్యంగా నిద్ర లేవరాదు. మాంసహారం, మద్యం, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాత బట్టలు ధరించకూడదు అన్నింటి కంటే ముఖ్యంగా దక్షిణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించదు.

 

 

Related posts